కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనాలను అందించడం కోసం అనేక నిర్ణయాలను తీసుకుంటోంది. పేదల కోసం గతంలో రూ.1.70 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇక ఇప్పుడు మధ్యతరగతి వర్గాల వారి కోసం.. ముఖ్యంగా వేతన జీవుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రూ.21వేల వరకు ఉన్న ఈఎస్ఐ లిమిట్‌ను రూ.30వేలకు పెంచనున్నారు.
దేశంలో ప్రస్తుతం రూ.21వేలు అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న వారికి ఈఎస్ఐ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఇకపై ఈ పరిధిని రూ.30వేలకు పెంచనున్నారు. దీంతో రూ.30వేలు, అంతకన్నా తక్కువ జీతం ఉన్నవారు కూడా ఇకపై ఈఎస్ఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక, వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మిక శాఖ విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది.
అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. అదే జరిగిగే రూ.30వేలు, అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ఈ క్రమంలో కంపెనీలు వారికి ప్రైవేటు ఇన్సూరెన్స్‌ను అందివ్వవు. ఇక ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే వారికి త్వరలోనే పలు రకాల మెడికల్, క్యాష్ బెనిఫిట్స్‌ను కూడా అందజేస్తామని కేంద్రం ప్రకటించింది.