ఏపీ ప్రభుత్వం సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, మరోవైపు హైకోర్టు నుంచి నోటీసులు.. మొత్తంగా సీఎం జగన్, ఆయన ప్రభుత్వం కూడా చేయని తప్పులకు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయం లో అధికార పార్టీకి చెందిన నాయకులు ఒకింత మౌనంగా ఉండి.. విమర్శలను పట్టించుకోకుండా ఉండి.. తమ పనేదో తాము చేసుకుంటూ పోతే.. ఏగోలా ఉండదు. వైసీపీ అధినేతగా జగన్ గతంలో ఇదే పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన కీలక విష యా ల్లోనే స్పందిస్తున్నారు తప్ప ప్రతి విషయాన్నీ రాజకీయం చేయాలని ఆయన భావించడం లేదు. కానీ, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఫైర్ బ్రాండ్లు అనిపించుకోవాలని ఉత్సాహపడిపోతున్నారు.
ఈ క్రమంలోనే సమయం సందర్భం కూడా చూసుకోకుండా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా.. మద్యం అమ్మకాలపై టీడీపీ శ్రేణుల నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు వచ్చా యి. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మీడియా మీటింగ్ పెట్టుకుని మరీ వివరణ ఇచ్చారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇది సరిపోతుంది. అయితే, తగుదునమ్మా.. అంటూ.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మాత్రం బాబు అనుకూల మీడియాను పిలిపించుకుని మరీ.. టీడీపీపై మాటల యుద్ధం చేశారు. తమ్ముళ్లను తిట్టిపోశారు. అయితే, ఇది మరింత వివాదానికి దారితీసింది.
సోమవారం మద్యం అమ్మకాలు ప్రారంభానికి ముందు నుంచే రాష్ట్రంలో అనుమతించిన మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు భారీ ఎత్తున క్యూ కట్టారు. కొన్ని జిల్లాల్లో ఈ క్యూలు కిలో మీటర్లు దాటిపోయాయి. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనల్లో కీలకమైన భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటివి కొన్ని చోట్ల ఉల్లంఘించారు. వీటిని పోలీసులు, మందు అమ్మేవారు కూడా పట్టించుకోలేదు. దీంతో ఆయా లోపాలను ఎత్తి చూపుతూ.. టీడీపీ నేతలు.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఖాయమని, ప్రభుత్వ నిర్వాకంతో ప్రజల ప్రాణాలమీదికి వస్తోందని ఆరోపించారు. ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా సహజం. దీనిని అధికార పార్టీ సీరియస్గా తీసుకున్నా..తదుపరి రోజు నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే సరిపోతుంది. కానీ, విడదల వారు మాత్రం రెచ్చిపోయారు. తనకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఆయా మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూకట్టిన వారంతా కూడా టీడీపీ కార్యకర్తలేనని, చంద్రబాబే వారిని ఉసిగొలిపి పంపారని, ప్రభుత్వంపై చెడు ఉద్దేశంతో కరోనా వ్యాప్తికి బాబు కంకణం కట్టుకుని ఇలా చేశారని ఫైరయ్యారు. నిజానికి దీనిలో నిజం ఉన్నా లేకున్నా.. ఇలాంటి సమయంలో ఇలాంటి పసలేని విమర్శలు చేయడం వల్ల పార్టీ పరువు మరింత దిగజారదా? అనేది కీలక ప్రశ్న. కానీ ఆమె మాత్రం తన విమర్శలు తాను చేసేసింది. దీంతో టీడీపీ నుంచి మరింత విమర్శలు వచ్చాయి. పంచుమర్తి అనురాధ.. ఫైరై.. అయితే, వైసీపీ కార్యకర్తలకు వలంటీర్ల ద్వారా ఇంటికే పంపించారా? అంటూ ఎదురు దాడి చేశారు. మొత్తానికి విడదల రాజకీయం మరోసారి విఫలమై.. పార్టీని ఇబ్బందిలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు.