దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కలిగించడం కోసం ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించగా.. గత ఐదు రోజుల నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఆదివారం ప్యాకేజీలోని చివరి అంశాలను తెలిపారు. అయితే కేంద్రం మొత్తం ఇచ్చింది రూ.3.22 లక్షల కోట్లేనని.. అది దేశ జీడీపీలో కేవలం 1.6 శాతమేనని.. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..పై విధంగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.3.22 లక్షల కోట్లనే ఇచ్చి.. దాన్ని రూ.20 లక్షల కోట్లని చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందని ఆనంద్ శర్మ ఆరోపించారు. పేదలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నగదు నేరుగా ఇవ్వాల్సిందిపోయి వారికి లోన్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలకు కేంద్రం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రూ.3.22 లక్షల కోట్లే ఇచ్చిందని చెప్పడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. దాన్ని తప్పని నిరూపించాలని ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాల్ విసిరారు. కేంద్రం వలస కార్మికుల కోసం సరైన సదుపాయాలు కల్పించకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. పేద ప్రజలకు ఉన్న కనీస హక్కులను కేంద్రం కాలరాసిందని ఆయన ఆరోపించారు.