తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టు కు కేంద్రం అనుమతి ఇవ్వగా.. తాజాగా మరో ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతి మంజూరు చేయడం విశేషం. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు మామూనూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలల స్వల్ప వ్యవధిలెోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని అన్నారు.