కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు అసలు దేశంలో 342 జిల్లాల్లో ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా లేదని పేర్కొంది కేంద్రం. కాసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత మంది మరణించారు అనే దాని మీద ఆయన లెక్కలు విడుదల చేసారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 941 కరోనా పాజిటివ్ కేసులు, 37 కరోనా మరణాలు నమోదు అయ్యాయని, ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కు చేరుకుంది అని చెప్పారు. మరణాల సంఖ్య 414కు చేరుకుంది. గత 24 గంటల్లో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన వివరించారు. అదే విధంగా మరో కీలక విషయం చెప్పారు ఆయన.
గత 24 గంటల్లో 30 వేల కరోనా టెస్ట్‌లు చేసామన్న ఆయన… దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,90,401 మందికి కరోనా పరిక్షలు చేసామని చెప్పారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఇక దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.