అదే మ‌రి.. అనాలోచిత చ‌ర్య అంటే.. ఇక‌నైనా కాస్త త‌గ్గండి..!

-

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు తొలి రెండు విడ‌త లాక్‌డౌన్‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేశారు. బాగుంది.. దేశంలో చాలా వ‌రకు క‌రోనా క‌ట్ట‌డి అయింది. ఒక‌టి రెండు రాష్ట్రాలు మిన‌హా.. చాలా చోట్ల ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ 3.0లో భాగంగా చేప‌ట్టిన‌ ఆంక్ష‌ల స‌డ‌లింపు అనే అనాలోచిత చ‌ర్య వ‌ల్ల ఇప్పుడు ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. గ‌త వారం ప‌ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. దీంతో రైలు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్న రైల్వే శాఖకు ఝ‌ల‌క్ త‌గిలింది. క‌రోనా విజృంభిస్తుంద‌ని చెప్పి జూన్ 30 వ‌ర‌కు రైళ్ల‌ను న‌డ‌ప‌బోయేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే అస‌లు రైళ్ల‌ను తిరిగి ప్రారంభించిన‌ప్పుడు కూడా క‌రోనా కేసుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. అయిన‌ప్ప‌టికీ కేంద్రం గుడ్డిగా ముందుకు వెళ్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ గాడిలో ప‌డాలంటే.. కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందే త‌ప్ప‌దు.. కానీ అవ‌స‌రం లేకున్నా.. ప‌లు ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డ‌మే.. ఇప్పుడు మ‌ళ్లీ మ‌న కొంప ముంచుతోంది. రైల్వే శాఖ దుందుడుకుగా.. ఏదో కొంప‌లు మునిగిపోయిన‌ట్లు స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. కానీ ప‌రిస్థితి తీవ్ర‌త‌రం అయ్యాక గానీ అస‌లు విష‌యం బోధ‌ప‌డ‌లేదు. అందుకే రైళ్ల‌ను నిలిపివేసింది. దీన్ని బ‌ట్టి చూస్తే.. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డం కూడా స‌రికాదేమోన‌న్న భావ‌న క‌లుగుతోంది.

లాక్‌డౌన్ 2.0 ఉన్న‌ప్పుడు భార‌త్‌లో మే 17వ తేదీ వ‌ర‌కు కరోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని కొంద‌రు చెప్పారు. కానీ ఆ తేదీ రానే వ‌చ్చింది. అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత ఎక్కువైంది. అందుకు ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. క‌రోనా దాదాపుగా అంత‌మ‌య్యేవ‌ర‌కు లాక్‌డౌన్ ఉంచాల‌ని సీఎం కేసీఆర్ స‌హా ప‌లు ఇత‌ర రాష్ట్రాల సీఎంలు కూడా గ‌తంలో చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వారి సూచ‌న‌ల‌ను కేంద్రం ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఫ‌లితం.. క‌రోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. రేపో మాపో ఆ కేసుల సంఖ్య చైనాను కూడా మించిపోనుంది. క‌నుక‌.. ఇక‌నైనా కేంద్రం కాస్తంత త‌గ్గి.. వాస్త‌వ ప‌రిస్థితిపై ఆలోచ‌న చేస్తే బాగుంటుంది. లేదంటే.. రానున్న రోజుల్లో ఏర్ప‌డే దుష్ప‌రిణామాల‌కు వారే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version