కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి షేకావత్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వివరాలపై చర్చ జరిగిందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్టు చెబుతున్నారు.
భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలన్న ముఖ్యమంత్రి 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని సీఎం పేర్కొన్నారు. దీని వల్ల ఆర్ అండ్ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిందని సీఎం పేర్కన్నారు.