పెళ్లంటే ఏంటో తెలియని వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. జీవితం ఇలానే ఆగిపోవాలని ఆలోచించలేదు. పెళ్లయినా పట్టువిడవకుండా ప్రైవేటుగా పదో తరగతి చదివింది. ముగ్గురు పిల్లలు ఉన్నా.. అతి కష్టం మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చదువు తర్వాత ఊహించని మలుపులు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నడుం బిగించింది. మహిళా చైతన్య ఉద్యమ సారథిగా మారింది. బాల్యవివాహాలపై పోరాడుతూ వేలమంది జీవితాలను చీకటిలో పడకుండా పోరాటం చేసింది. తనే.. మహారాష్ట్రలోని తుల్జాపూర్ కు చెందిన లక్ష్మి.. ఈమె స్ఫూర్తి గాథే ఇది.
ఈ ప్రాంతంలో పితృస్వామ్య ఆధిపత్యం ఎక్కువ. ఆడపిల్లలను చిన్న వయసులోనే బాల్యవివాహం చేసేసి.. కుటుంబం, బరువు బాధ్యతులనే ఊబీలో నెట్టేస్తుంటారు. మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయంపై ఆమె గొంతు పెగల్చింది. మహిళలకు హక్కులన్నాయనే నిజాన్ని తోటి మహిళలకు తెలియజెప్పి వారిలో చైతన్యం పెంచింది. లక్ష్మి చేపట్టిన ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 17 వేల మంది జీవితాలు గట్టున పడ్డాయి. బాల్యవివాహం, రెండో వివాహం నుంచి తప్పించుకున్న వాళ్లే ఇందులో ఎక్కువ. ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టడానికి స్ఫూర్తి ఎవరని లక్ష్మిని అడిగితే ఆమె చెప్పే సమాధానం.. ‘‘బాల్య వివాహంతో నా జీవితం అనే సుడిగుండంలో చిక్కుకుపోయింది. నాలా వేరే మహిళ కావొద్దని భావించాను. నన్ను నేను నిలబెట్టుకోవడానికి.. పోరాటం చేశాను.’’ అని ఆమె పేర్కొంది.
మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో లక్ష్మిది చర్మకారుల కుటుంబం. తన మేనమామతోనే ఎనిమిదేళ్ల వయసులో లక్ష్మికి వివాహం జరిగింది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ సంబంధాలు వెతికి పెళ్లి చేయడం కన్నా చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుందని లక్ష్మి అమ్మానాన్నల ఆలోచన. పెళ్లంటే తెలియని వయసులో పెళ్లి జరిగింది. చదువు కోసం నానా కష్టాలు ఎదుర్కొంది. భోజనం మానేయడం, చచ్చిపోతానని బెదిరించడం చేసింది లక్ష్మి.
చదువు పూర్తి చేసినా జీవితంలో ఏదో కోల్పోయానని భావించింది. అప్పుడే ప్రభుత్వ సూచనతో స్వయం సహాయక బృందాల ఏర్పాటు చేశారు. భర్త నుంచి విడిపోయిన వారు, వితంతులకు ప్రాముఖ్యతను ఇచ్చారు. సింగిల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ష్యూరిటీ అవసరం లేకుండానే బ్యాంకు నుంచి రుణాలు పొందారు. దాదాపు 200 మంది ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇలా మహోద్యమాన్ని విస్తృతం చేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మందికి లక్ష్మి సహకారం అందించింది. ఈ మేరకు సీఐఐ సీఈఓ సీమా అరోరా.. లక్ష్మిని ప్రశంసించారు. మహిళలకు ఆదర్శంగా నిలిచి.. అండగా నిలబడింది.