ప్రతి ఏడాది వినాయకచవితి వేడుకలు, గణేష్ నిమర్జన కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు ఆ స్థాయిలో జరిగేలా కనిపించడం లేదు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో సమూహాలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే గణేష్ నిమర్జనం విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
ధర్మకోల్, ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని పూర్తిగా నిషేదించింది. విగ్రహాల నిమర్జనం కోసం తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేయాలని సూచించింది. నిమర్జనం చేసే ముందు పూలు, ఇతర సామాగ్రి అన్నింటి విగ్రహం నుంచి తొలగించి కేవలం విగ్రహాలను మాత్రమే నిమర్జనం చేయాలని తెలిపింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నది. ఎకో ఫ్రెండ్లి సామాగ్రిని ఉపయోగించాలని, రసాయన రంగులు కాకుండా, సహజసిద్ధంగా తయారు చేసిన రంగులను మాత్రమే విగ్రహాల తయారీలో వినియోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అంతేకాదు, నిమర్జనం చేసిన విసర్జనాలను తొలగించేందుకు చార్జీలు వసూలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల్లో పేర్కొన్నది.