ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 60 శాతం నిధులతో అమలవుతున్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ ను అదే పేరుతో అమలు చేయకుండా రాష్ట్రాలు సొంత స్టిక్కర్లు వేసుకుంటే తాము ఆ పథకాన్ని నిలిపిస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్ సుక్ మాండవియా హెచ్చరించారు.
ఇదే విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లకు లేఖలు రాశామన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు దీనిపై ప్రస్తావించారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ తో సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీఎం జన్ ఆరోగ్య యువజన ద్వారా విస్తృత సేవలు అందిస్తున్న ఈ పథకాన్ని రాష్ట్రాల్లో వేరే పేర్లతో అమలు చేస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ ఏపీలో పర్యటించినప్పుడు కొన్ని లోపాలను గమనించారన్నారని తెలిపారు.