పిన్నెల్లి వీడియోపై సీఈవో ప్రకటన చేశారు. ఆ వీడియోను మేం విడుదల చేయలేదన్నారు సీఈవో ఎంకే మీనా. వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని.. చర్యలు కూడా ఉంటాయన్నారు. వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4 న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటు వంటి వివాదాలకు తావులేకుండా సంబందిత వివరాలను అంటే ఏ రోజు న, ఎన్నిక గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను వ్రాతపూర్వకంగా సంబందిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజంట్లకు ముందుగానే తెలియజేయలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.