కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టిక్కెట్‌ను ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చలమల భావించారు. కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో భేటీ అయ్యారు. అనంతరం నేడు బీజేపీలో చేరారు. ఈ రోజు పలువురు నేతలు బీజేపీలో చేరారు. చలమల కృష్ణారెడ్డితో పాటు బోథ్ టిక్కెట్ ఆశిస్తున్న రాథోడ్ బాపురావు, ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న సుభాష్ కూడా బీజేపీలో చేరారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గ బాధ్యతలను చలమల కృష్ణారెడ్డి తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోయినా.. పార్టీ అభ్యర్థి స్రవంతి కోసం ఆయన పని చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఆయన ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో రెండో జాబితాలో మునుగోడు టికెట్ ను ఆయనకే కేటాయించింది హస్తం పార్టీ. దీంతో కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని వీడుతున్నారు కృష్ణారెడ్డి. ఆయన వెంట కాంగ్రెస్ కేడర్ కూడా బాగానే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందేనన్న చర్చ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది.