తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. బయటి కొచ్చిన అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన హైదరాబాద్ విచ్చేశారు.
బేగంపేటలో తెలుగు తమ్ముళ్లు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో బాబుకు కంటి పరీక్షలు చేయనున్నారు. 52 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత చంద్రబాబు నాయుడు, వైద్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీగా చంద్రబాబు వాహనం వెంట జూబ్లీహిల్స్‌కు వరకు చేరుకున్నారు. రోడ్డు పొడవునా జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు అభివాదం తెలిపారు. చంద్రబాబు జూబ్లీహిల్స్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు షరతులు ఉండటంతో చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా ఇంటికి చేరుకున్నారు. గురువారం ఆయన కంటికి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.