దేశ రాజధాని ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించినా.. బెదరని పంజాబ్, హరియాణా రైతులు వెనకడుగు వేసేది లేదని భీష్మించుకుని కూర్చుంటున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్-హరియాణాకు చెందిన రైతులు సింఘూలో ఇంకా తమ నిరసనను విరమించలేదు.
నేడు మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫతేగఢ్ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. మరోవైపు డిసెంబరు 3వ తేదీన చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి వరకు రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు.
మరో వైపు రైతుల నిరసన ప్రదర్శన సందర్భంగా హరియాణా భివానీ జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై రైతులు ప్రదర్శనగా ఢిల్లీ వెళ్తుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీ కొనడం వల్ల తీవ్రగాయాలై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళన మరింత ఉధృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.