కరోనా లాక్‌డౌన్ వల్ల ఇన్నాళ్లూ హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. దాదాపుగా 2 నెలల అనంతరం మళ్లీ ఆయన ఏపీలో సోమవారం అడుగు పెట్టారు. అయితే ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన తమ్ముళ్లను చూసి ఆనందం పట్టలేకపోయారో, ఏమో తెలియదు కానీ.. ఆయన కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. ఓవైపు కరోనా జాగ్రత్తలను పాటించాలని చెబుతూనే మరో వైపు ఇలా ఆయన లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కడం వివాదాస్పదమవుతోంది.
చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. అయినప్పటికీ వారిని వారించాల్సిన చంద్రబాబు ఆ పనిచేయలేదు. దర్జాగా కారు నుంచి బయటకు వచ్చి టీడీపీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక చంద్రబాబు కాన్వాయ్ వెంట కొందరు బైక్ ర్యాలీ తీశారు. మరోవైపు పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పినా.. వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో చంద్రబాబు, ఆయన తమ్ముళ్ల వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పాల్సిన బాబు ఇలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.