ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతం వరకే ఉన్న ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేసారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు అందరూ జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను నేతలు భోగిమంటల్లో తగులబెట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడంలేదని, అమరావతికి ఘన చరిత్ర ఉందని, అమరావతి కేంద్రంగా వేల ఏళ్ల క్రితమే రాజ్యం ఉండేదన్నారు.
అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు విజ్ఞప్తి చేసారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసారు. ఒకప్పుడు మద్రాస్ అభివృద్ధికి, తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. అమరావతిని చించాలంటే భవిష్యత్ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. తెలుగుదేశం నేతలు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో నివేదికలను తగలబెట్టారు.