ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కనీసం ఆరు నెలలు అయినా గ్యాప్ తీసుకుని పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. అయితే బాబు రెండో నెల నుంచే వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా సమీక్షలో టీడీపీలో ఓ సీనియర్ ఫ్యామిలీ వెన్నుపోటు గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నగరి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి తనయుడు గాలి భానుప్రకాశ్ పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే రోజా చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ముద్దుకృష్ణమపై కేవలం 900 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచిన రోజా ఈ ఎన్నికల్లో ముద్దుకృష్ణమ తనయుడు భానుప్రకాశ్‌పై కేవలం 2300 ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే గెలిచారు. రెండుసార్లు కూడా రోజా స్వల్ప తేడాతోనే గెలిచారు.
ఇక ఈ ఎన్నికల్లో ముద్దుకృష్ణమ మృతితో ఆయన తనయుడు భానుప్రకాశ్ ఖచ్చితంగా గెలుస్తాడని అందరూ అనుకున్నారు. అయితే సడెన్‌గా ఆ కుటుంబంలో గ్యాప్ రావడంతో చంద్రబాబు ఆ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరకు ఎమ్మెల్సీ పదవి కోసం వారసులు ఇద్దరూ పోటీ పడడంతో బాబు మధ్యేమార్గంగా గాలి సతీమణి సరస్వతమ్మకు ఇచ్చారు.
ఎన్నికల్లో సీటును భానుప్రకాశ్‌కు ఇవ్వగా కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇదే అంశంపై బాబు మాట్లాడుతూ ముద్దుకృష్ణమ నాయుడు మరణానంతరమే అభ్యర్థిని ప్రకటించి ఉంటే నగరి టికెట్‌ను పోగొట్టుకునేవాళ్లం కాదని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆలస్యం చేయాల్సి వచ్చిందన్నారు.
గాలి కుటుంసభ్యులు కలస్తారేమో అనుకున్నాను గానీ, ఇలా ఓటమికి పనిచేస్తారనుకోలేదన్నారు. నాయకులుగా ఎదగాలనుకునే వారు శత్రువుల్ని పెంచుకోకూడదని హితవు పలికారు. దీనిని బట్టి భాను ఓటమికి కుటుంబ సభ్యులు సహకరించలేదని ఆయన ఓపెన్‌గానే చెప్పేశారు. భాను కష్టపడితే మంచి నాయకుడిగా ఎదుగుతారన్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించవచ్చు కదా ? అని చెప్పారు.