వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది. ‘ఇదేం కర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈరోజు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పోటీగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే.. ఓడిపోతామనే భయంతో, పిరికితనంతో సీఎం జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో చివరి రోజు శుక్రవారం ఆయన ఇక్కడ టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. అనంతరం గాయత్రీ ఎస్టేట్ ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయం ఆవరణలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బయల్దేరారు. అయితే వైసీపీ సానుభూతిపరులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారంతా పేటీఎం బ్యాచ్ అని, వైఎస్సార్ పార్టీ గూండాలని విరుచుకుపడ్డారు. ‘చేతగాని దద్దమ్మల్లారా.. నేరాలు, ఘోరాలు చేసే దుర్మార్గుల్లారా.. ఎంత ధైర్యం మీకు? మా ఇంటికి వస్తారా.. మా ఆఫీసుకు వస్తారా.. మీ అంతు చూస్తా..’ అని నిప్పులు చెరిగారు.