ఎప్పుడు ఏది అనుకూలంగా ఉంటే.. దానిని టార్గెట్ చేయడం రాజకీయంగా జరిగే పనే..! ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుందని భావిస్తే.. దానివైపు నాయకులు మొగ్గు చూపుతారు. ఇలాంటి మైలేజీ రాజకీయాల్లో మాజీ సీఎం, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును మించిన నాయకుడు లేడని అంటారు పరిశీలకులు. ఏ విషయాన్నయినా.. తనవైపు తిప్పుకోవడంలో చంద్రబాబు వేసే వ్యూహాలకు మంచి మార్కులే పడుతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు కూడా చంద్రబాబు తనకు ఎదురయ్యే ప్లస్‌లు, మైనస్‌లను కూడా అనుకూలంగా మార్చుకుని రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విపక్ష నాయకుడిగా ఉన్న బాబు తనదైన శైలిలో విజృంభిస్తున్నారు.
జగన్‌కు పాలన చేతకాదనే ప్రచారం ఎన్నికలకు ముందు నుంచి ఆయన చేస్తున్నదే. అదే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇక, ఈ సమయంలోనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాబు తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఆనుపానులు కనిపెట్టి వెంటనే స్పందిస్తున్నారు. అయితే, దీనిలోనూ రెండు కోణాలు వెతుక్కుంటున్నారు. ప్రజలు మెచ్చేది అయితే.. ఓటు బ్యాంకుతో ముడిపడేదే అయితే.. తానే గతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని ఆయన చెబుతున్నారు. అంటే.. అంతిమంగా ఈ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే తన ఓటు బ్యాంకును హరించేదే అయితే.. తిరగబడుతున్నారు. ఈ క్రమంలోనే రాజధాని విషయాన్ని రాజకీయం చేశారు.
అమరావతి నిరసనని జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లారు. దీని నుంచి తనకు మైలేజీ ఆశించారు చంద్రబాబు. అయితే, ఈ విషయంలో జగన్ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. దీంతో ఈ విషయాన్నే పట్టుకుని కూర్చున్న చంద్రబాబుకు చాపకింద నీరు మాదిరిగా జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల విభజన, తెలుగు మాధ్యమం రద్దు. ఈ రెండు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు.
కేవలం అమరావతినే పట్టుకుని కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదని, దీనిపై కేంద్రంలోని బీజేపీ కూడా చేతులు ఎత్తేసింది కాబట్టి.. మిగిలిన రెండు విషయాలనైనా ఫోకస్ చేసి..త మకు అనుకూలంగా రాజకీయాలను నడిపించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. జగన్‌ను ఢీకొట్టే విషయంలో రోజుకో పరీక్ష రాస్తున్నట్టుగా బాబు ఫీలవుతున్నారని తమ్ముళ్లే చెబుతుండడం గమనార్హం.