ఔను! ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. ఎవరికి ఎవరు డెడ్‌లైన్ పెడుతున్నారు? అని ప్రశ్నిస్తున్నవారు కూడా కనిపిస్తున్నారు. అమరావతి విషయంలో కదం తొక్కుతున్నానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. మూడు రాజధానుల విషయంపై ప్రజాభిప్రాయం కోరాలని, దీనికి ప్రజలు ఓకే అంటే.. తాను ఏమీ మాట్లాడబోనని, కాబట్టి.. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిఎన్నికలకు వెళ్లాలని ఆయన సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు ఆయన పెట్టుకున్న సమయం 48 గంటలు. ఈ సమయం గడిచిపోయింది. అయితే, ఈ డెడ్‌లైన్‌తో చంద్రబాబు సాధించేది శూన్యమని అంటున్నారు పరిశీలకులు.
గతంలో ప్రత్యేక హోదా సమయంలోను, అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే సమయంలోనూ ఇంతే పారదర్శకతతో చంద్రబాబు వ్యవహరించి ఉంటే.. ఇలానే ప్రజల అభిప్రాయం కోరాలని భావించి ఉంటే.. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాటలను ప్రజలు విశ్వసించి ఉండేవారని, లేదా చంద్రబాబుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోటెత్తి ఉండేవారని, కానీ, అలాంటివేవీ లేకుండానే చంద్రబాబు తనకు నచ్చిన విధంగా గతంలో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షంగా జగన్ పార్టీ సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. పోనీ.. ఇప్పుడు ఏదైతే ప్రజాభిప్రాయం కోరాలని అంటున్నారో.. దానినే ఆయన కోరలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తగుదునమ్మా.. అంటూ.. ప్రభుత్వం తనదికాకపోయేసరికి.. ప్రభుత్వంలో తానే ఉండాలనే కోరిక ఇంకా చావకపోయేసరికి ఇలా జగన్ ప్రభుత్వంపై సవాళ్లు రువ్వుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతాన్ని అవగతం చేసుకోవడం అనేది రాజకీయాల్లో చాలా తక్కువే అయినప్పటికీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చంద్రబాబుకు ఇలా చేయడం తగునా? అని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించాలని జగన్ పిలుపు నిచ్చినప్పుడు.. అపహాస్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాలు చేయడం భావ్యమేనా?
పోనీ.. అప్పట్లో జగన్ మన రెండు పార్టీల ఎంపీలూ రాజీనామాలు చేద్దామని చెప్పి.. బాబు కలిసిరాకపోవడంతో తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించారు. మరి ఇప్పుడు రాజీనామాల విషయంపై జగన్‌కు సవాలు రువ్విన చంద్రబాబు.. జగన్ కలిసిరాని నేపథ్యంలో తాను, తన పార్టీ నేతలతో రాజీనామాలు చేయించే సాహసం చేయగలరా? ఇది సాధ్యమైతే.. ఇలాంటి డెడ్‌లైన్‌లు పెట్టినా ప్రజలు విశ్వసిస్తారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చెబుతారో చూడాలి.