రాజధాని విషయం రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఒక్కో విధంగా ఇరుకున పెడుతోంది. మూడు రాజధానులతో ముందుకు వెళ్లాలన్న వైఎస్సార్ సీపీకి న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయి. అదే సమయంలో టీడీపీకి.. అమరావతిలోని లొసుగులు అడ్డంకిగా మారాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇంకేముంది.. వచ్చే ఎన్నికల నాటికి జనసేనానితో కలిసి.. అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న బీజేపీకి ఇప్పుడు అసలు సమస్య తగిలింది. ఇప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా అమరావతి కోణాన్ని బీజేపీవైపు తిప్పేశారు. తనవైపు వచ్చే విమర్శలను ఆయనను చాలా తెలివిగా బీజేపీవైపు తిప్పారని అంటున్నారు పరిశీలకులు.
అదెలా అంటే.. రాజధానిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటివారు కూడా అమరావతికి మద్దతిచ్చారని గుర్తు చేస్తున్నా రు. అయితే, ఇప్పుడు కేంద్ర యూటర్న్ తీసుకోవడంతో చంద్రబాబు తప్పంతా.. బీజేపీదేనని, బీజేపీ వైఎస్సార్ సీపీ కుమ్మక్కయి.. అమరావతినిమట్టిపాలు చేస్తున్నాయని కొత్త రగడ తెరమీదికి తెచ్చారు. అంటే.. ఈ అమరావతి నిర్ణయంలో తన పాత్రలేదని, బీజేపీది కూడా ఉందని, కాబట్టి దీనిని కూడా అడగాలని ఇక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. మొత్తంగా చూస్తే.. దీనిని ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా కూడా రెడీ అయింది.
ప్రభుత్వం వేరు.. బీజేపీ వేరు అంటూ. బీజేపీ నేతలు జగన్‌తో కలిసిపోయారంటూ.. చంద్రబాబు పాటనే ఓ వర్గం నేతలు, మీడియా ప్రచారం చేయడం ప్రారంభించారు. వాస్తవానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతిని ఎంపిక చేయలేదు. రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగానే అమరావతిని కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. మరి అప్పుడు కూడా అదే బీజేపీ నేతలు చంద్రబాబుతో కలవలేదా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ వర్గాల నుంచి కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పుడు పనిగట్టుకొని కొంత మంది అమరావతిపై కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినప్పటికీ.. బీజేపీని బూచిగా చూపించి చంద్రన్న చంద్ర నాటకాలకు తెరదీశారనేది పరిశీలకుల మాట. ఇదే కనుక ప్రజల్లోకి వెళ్తే.. బీజేపీ మరింత నష్టపోవడం ఖాయం అంటున్నారు.