కుల ‘పోట్లు’తో బాబు కి తలపోట్లు ?

-

ఎవరు అవునన్నా, కాదన్నా, రాజకీయ పార్టీలు ఎప్పుడూ, కులాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంటాయి. సామాజిక వర్గాల వారిగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయి. కుల మంటలు రాజేసి, చలి కాచుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ విషయంలో మిగతా రాజకీయ పార్టీలు, ఆ పార్టీ అధినేతల అభిప్రాయం ఎలా ఉన్నా, టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంలో క్లారిటీ తో ఉంటారు. రాజకీయాలలో ఎప్పుడూ తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ కుల లెక్కలు ఆధారంగానే చంద్రబాబు ఇప్పటి వరకు పైచేయి సాధిస్తూ వస్తున్నారు. కానీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వేసిన కులాల లెక్కలు బెడిసికొట్టాయి. చంద్రబాబుకు అధికారం దూరం చేశాయి. ఒక వర్గం ఓట్లను సాధించే క్రమంలో, మరో ప్రధాన సామాజిక వర్గాన్ని, మొదటి నుంచి టిడిపి కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న వర్గాన్ని చంద్రబాబు దూరం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు.


అసలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజిక వర్గాల మద్దతు ఉంటూ వచ్చింది. పార్టీని వారి భుజాలపై మోస్తూ , పార్టీని ఎప్పటికప్పుడు అధికారంలోకి తీసుకు వచ్చేవారు. కానీ 2019 ఎన్నికలకు ముందు కాపులను దగ్గర చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడంతో, క్రమక్రమంగా బీసీలు టీడీపీకి దూరమయ్యారు. కాపులు వైసీపీ వైపు వెళ్లిపోతున్నారని, చంద్రబాబు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పదవుల్లోనూ, నిధుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం కల్పించడం వంటి పరిణామాలు బీసీ సామాజికవర్గాలకు ఆగ్రహాన్ని కలిగించాయి.

కాపులు కారణంగా బీసీలు తమకు దూరమవుతున్నారనే విషయం చంద్రబాబుకు తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కాపులు, బీసీలు ఇద్దరి మద్దతు పూర్తిగా దూరం కావడంతో చంద్రబాబు అల్లాడుతున్నారు. మరోపక్క బిజెపి సైతం కాపులను దగ్గర చేసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకపక్క జనసేన తో పొత్తు పెట్టుకుని, పవన్ సహకారంతో కాపులను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తుంది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని నియమించారు. దీంతో ఇక కాపులను పట్టుకుని వేలాడితే లాభం ఉండదనే అభిప్రాయంతో, బీసీలను దగ్గర చేసేందుకు చంద్రబాబు వారికి ఎక్కువగా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మళ్లీ ఆ వర్గం వారిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ సైతం బీసీల్లో వివిధ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి భారీగా నిధులు కేటాయించాలని చూస్తున్నారు. దీంతో వైసీపీ కి బీసీలు మరింత దగ్గరవుతారు తప్ప, టిడిపి వైపు వచ్చే అవకాశమే లేదు. అలాగే పదేపదే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ టిడిపి నాయకులు విమర్శలు చేస్తుండడంతో, పూర్తిగా ఆ సామాజిక వర్గం టిడిపికి వ్యతిరేకంగా మారిపోయింది. ఇక దళితులు  కూడా జగన్ కు దగ్గరవ్వడంతో చంద్రబాబు కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ పదవుల్లో సామాజిక వర్గాల వారిగా అందరికీ పెద్దపీట వేయాలని చూస్తున్నారు. అయినా బాబు వ్యూహం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version