కరోనా విజృంభణను నియంత్రించే విషయంలోను, కరోనా రోగులకు వైద్యం అందించే విషయంలోను.. జగన్ సర్కారు విఫలమైందంటూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు.. కొన్నాళ్లుగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అంటే.. ఏపీలో కరోనా బాధితులకు సరైన విధంగా వైద్యం అందించడం లేదని, క్వారంటైన్ కేంద్రాల్లోనూ సరైన ఆహారం పెట్టడం లేదని.. ఆరోపించారు. ఈ సమయంలోనే ఏపీకి కేంద్రం కరోనా నిధుల కింద వేల కోట్ల రూపాయలు ఇస్తోందని.. అయితే, జగన్ మాత్రం.. ఈ నిధులను పక్కదారి పట్టించి.. తన సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.
ఇదే విషయంపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఆరోపణలు చేశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని.. ఆ నిధులను జగన్ విచ్చలవిడిగా సొంతానికి ఖర్చు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఏపీకి కరోనా ఖర్చుల కోసం ఇచ్చిన మొత్తాల వివరాలను తాజాగా వెల్లడించింది. ఏపీలో కరోనా కట్టడికి సుమారుగా 200 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇక, తెలంగాణకు 270 కోట్లను ఇచ్చినట్టు తెలిపారు. దీంతో కరోనా సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వచ్చాయో స్పష్టమైంది.
ఈ పరిణామం టీడీపీ నేతలకు షాకిచ్చినట్టయిందని, ఇక.. కరోనా నిధుల విషయంలో ష్ గప్‌చుప్! అన్న విధంగా నాయకులు మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. కరోనా నిధుల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం ఏదో ఇచ్చేసిందని చెబుతూ.. వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అసలు విషయం తెలిసిపోవడంతో దీనిపై నోరు మెదపడం మానేశారు.
ఇక, టీడీపీ నేతలు కూడా నిన్న మొన్నటి వరకు జగన్‌పై విరుచుకుపడ్డారు. అక్కడ ఆ ఏర్పాటు లేదు. ఇక్కడ ఈ వసతి లేదు.. అని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు మాత్రం పరిస్థితి కళ్లముందు కనిపించేసరికి.. మౌనమే బెటర్ అని అనుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా .. కరోనా విషయంలో కేంద్రం.. వెల్లడించిన వివరాలు.. చంద్రబాబుకు గాలి తీసేసినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.
-Vuyyuru Subhash