రాజకీయాల్లో పైచేయి సాధించాలని ఎవరికి మాత్రం ఉండదు! నిన్నగాక మొన్న పెట్టిన జనసేన అధినేత పవన్‌కే పైచేయి సాధించాలని ఉంది. అయితే, సమయం, సందర్భం కలిసి రావడం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా?! కానీ, ఈ విషయంలో చంద్రబాబు తన అనుభవాన్ని పక్కనపెట్టారో.. లేక తన అనుభవం తో పనిలేదని అనుకున్నారో .. మొత్తానికి శాసన మండలి విషయంలోపైచేయి సాధించాలని అనుకుని చతి కిలపడ్డారనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. జగన్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఏ విషయంలో చూసినా.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక మేలు చేస్తోంది. దీంతో తన పార్టీకి, తనకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆవే దనగా మారిన మాట నిజమే. అయితే, ఈ క్రమంలో ఆయన జగన్‌పై పైచేయి సాధించేందుకు వేరే వేరే మా ర్గాలు అన్వేషించుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ఫైట్ చేసి విజయం సాధించి ఉం టే బాగుండేది. కానీ,బాబు మండలి కేంద్రంగా రాజకీయాలు తీవ్రం చేశారు.
రాష్ట్రంలో మూడు రాజధాను లను ఆది నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అందివచ్చిన అవకాశం మండలి. అయితే, నిబంధనల మేరకు అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొక్కి పెట్టడం మండలికి సబబు కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చెబుతున్నదే ఒక్క టీ డీపీ తప్ప. అయినా కూడా చంద్రబాబు తన వ్యూహాన్ని మండలిలో పారించారు.
ఫలితంగా రాష్ట్రంలో వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లిపోయాయి. ఈ పరిణామం అప్పటికప్పుడు టీడీపీలో ఉత్తేజం నింపితే నింపి ఉండొచ్చు. కానీ, దీర్ఘకాలంలో చూసుకుంటే.. మరో రెండు మూడేళ్లపాటు సభ్యులకు అవకాశం ఉన్నా కూడా మండలి రద్దుతో అందరూ ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో తాను పైచేయి సాధించిన దానికన్నా కూడా చతికిల పడిందే నష్టం ఎక్కువగా తెచ్చిందని బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. నిజమే కదా!!