ఆందోళనలో ఉన్న గ్రూప్ -2 అభ్యర్థులను పిలిచి చంద్రబాబు చర్చించాలి : షర్మిల

-

ఏపీ గ్రూప్ -2 వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు. ” గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు.

తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. APPSC మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు షర్మిల. 

Read more RELATED
Recommended to you

Exit mobile version