సితార సెంటర్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేద్దామనుకున్నామని కానీ జగన్ వచ్చి ముద్దులు కురిపిస్తే కరిగిపోయి ఓటేశారని అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పి.. అవసరం తీరాక రాజధానిని మార్చేస్తున్నారని అన్నారు. నా దగ్గర పోలీసులు చాలా చక్కగా పని చేసేవారు.. ఇప్పుడేమైందో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ దగ్గర గుమాస్తాగా పని చేసే వ్యక్తి పోలీసులను నియంత్రిస్తున్నారన్న ఆయన డీజీపీకి నెత్తి మీద టోపీ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదని అన్నారు.
జగన్ కి ఏడాదికి ఐదు వేల కోట్లు ఆదాయం కావాలన్న ఆయన మద్యం సొమ్మును అడ్డం పెట్టి అప్పులు తెస్తున్నారు.. రూ. 50 వేల కోట్లు అప్పు తెస్తున్నారని అన్నారు. అసలు ఇక మద్యపాన నిషేధం ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఎవరైనా మాట్లాడితే వారి ఇంటి వద్దకు పోక్లెయిన్ వస్తుందని రాష్ట్రంలో పొక్లెయిన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాత్రికి రాత్రే ముసుగు వీరులొస్తారు.. డబ్బులు పంచుతారని అన్నారు. జగన్ పిరికిపంద.. బయటకు రాలేడు.. ధైర్యం ఉంటే నా మాటలకు బయటకొచ్చి కౌంటర్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.