భాగ్యనగరవాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. చాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లైఓవర్ ప్రారంభానికి రెడీ అయ్యింది. మరికాసేపట్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో SRDP చేపట్టిన ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా టార్గెట్ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. SRDP ద్వారా నగరంలో నలువైపులా GHMC ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసింది.
ఇప్పటివరకూ నగరంలో మొత్తం 15 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, ఆర్‌ఓబీలు చేపట్టింది. అర్బన్ డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. ఈ వంతెన నిర్మాణంతో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ప్రయాణించడం మరింత సులభతరం కానుంది. అలాగే నల్గొండ, వరంగల్ వెళ్లడం కూడా మరింత సులభం అవుతుంది. మొత్తం రూ.45.79 కోట్లు పెట్టి ఈ వంతెన నిర్మించారు.