అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకు వచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన పథకం..ఈ పథకం 2015 లో ప్రారంభం అయ్యింది.తాజాగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం నిబంధనలను సవరించింది.
ఈ నిబంధనలు 1 తేదీ అక్టోబర్ 2022 నుంచి వర్తించనున్నాయి. మారిన అటల్ పెన్షన్ యోజన నిబంధనలలో.. ఆదాయపు పన్ను చెల్లింపుదారు అటల్ పెన్షన్ యోజన ఖాతాను అక్టోబర్ 1, 2022 నుంచి తెరవడానికి అర్హులు కాదు. ఒకవేళ, ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయిన చందాదారుడు 1 అక్టోబర్ 2022న లేదా ఆ తర్వాత APY స్కీమ్‌లో చేరితే, అతని/ఆమె APY ఖాతాను మూసివేస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇలాంటి ఖాతాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు చెప్పింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం..
ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్న వారు అక్టోబర్ 1, 2022 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హులు కాదు.
ఎవరైనా అక్టోబర్ 1కి ముందు లేదా ఆ తర్వాత పథకంలో చేరి ఉంటే.. కొత్త రూల్ అమల్లోకి వచ్చిన తేదీ లేదా అంతకుముందు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా గుర్తించబడితే అతని/ఆమె ఖాతా వెంటనే మూసివేస్తారు.
అప్పటివరకు డిపాజిట్ చేసిన మొత్తం ఎమౌంట్ ను తిరిగి చెల్లించనున్నారు..
అటల్ పెన్షన్ యోజన ఎంట్రీ రూల్స్..
ప్రస్తుత అటల్ పెన్షన్ యోజన నిబంధనల ప్రకారం.. 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరుడు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు ప్రకారం, అటల్ పెన్షన్ యోజన నగదును చెల్లించవలసి ఉంటుంది. నెల నెలా రూ.100 నుంచి రూ.500 వరకు చెల్లించవచ్చు.
60 సంవత్సరాల వయస్సు నుంచి చందాదారులకు నెలకు చెల్లించిన నగదు ప్రకారం.. రూ.1000 నుంచి రూ.5000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటారు.
చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లిస్తారు.
చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత, చందాదారుని 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్ సంపదను తిరిగి నామినీకి ఇస్తారు..
కొత్త నియమం అమల్లోకి రావడంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1, 2022 నుంచి ఈ పథకంలో చేరలేరు..పెట్టుబడి కూడా పెట్టలేరు..ఇది గుర్తుంచుకోండి..