బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఖాళీ అయిన రాజసింహాసనంపై అందరి దృష్టి పడింది. తదుపరి ఆ సింహాసనాన్ని అధిష్టించే రాణి/రాజు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు ప్రపంచమంతా శోక సంద్రంలో ఉండగా.. మరోవైపు తదుపరి రాజుగా ఛార్లెస్‌ను ప్రకటించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత.. 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. శనివారం ఛార్లెస్ అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు.
ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించేందుకు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశం అవుతారు. ఆ తర్వాత పార్లమెంటును సమావేశపరుస్తారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత ప్రకటిస్తారు. తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తారు.
ఆ ప్రకటనపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌తోపాటు, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేస్తారు. అనంతరం రాయల్ బ్యాండ్ వాద్యాల నడుమ ఛార్లెస్‌ను కొత్త రాజుగా ప్రకటిస్తారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లోని ఫెయిరీ కోర్ట్ బాల్కనీ నుంచి ‘గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్’గా వ్యవహరించే అధికారి ఈ ప్రకటన చేస్తారు. గాడ్ సేవ్ ద కింగ్ అని బిగ్గరగా అరుస్తూ ప్రకటన చేస్తారు. 1952 తర్వాత తొలిసారిగా ఈ ప్రకటన వెలువడనుంది.