మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత? స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవడానికి మెడికల్ గ్యాడ్జెట్స్ అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు. సులభంగా మీ బ్లడ్‌లోని ఆక్సిజన్ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన మరింత పెరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.దీనివల్ల ప్రజలు ఎక్కువ శాతం థర్మామీటర్, బీపీ మానిటర్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ లాంటివి కొంటున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ఇంట్లోనే ముందస్తు పరీక్షలు చేసుకుంటున్నారు. ఇలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఉంటే పర్లేదు. అయితే, ఇటువంటి గ్యాడ్జెట్ కొనలేని వారి పరిస్థితి ఎలా.. వారికి స్మార్ట్‌ఫోన్ నే హెల్త్ గ్యాడ్జెట్‌గా మార్చుకునే టెక్నాలజీ వచ్చింది. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్‌గా మార్చుకోవచ్చు. హెల్త్ స్టార్టప్ ఎంఫైన్ ఈ సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. ఈ సంస్థ రూపొందించిన టూల్ ద్వారా మీ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ ను స్మార్ట్‌ఫోన్ తో చెక్ చేసుకోవచ్చు. ఇది బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో విడుదల అయింది. ఐఓఎస్ డివైజ్‌లకు త్వరలో ఈ యాప్ రానుంది.
ఈ ఎంఫైన్ సంస్థ రూపొందించిన బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్ ఉపయోగించడానికి ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి MFINE యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్ ఓపెన్ చేయాలి. అందులో Mpulse సెలెక్ట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆన్ చేయాలి. కెమెరా, ఫ్లాష్ లైట్పైన మీ చేతి వేలిని పెట్టాలి. అప్పుడు స్క్రీన్ ఎరుపు రంగులోకి మారుతుంది. మీ బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే ఎరుపు, బ్లూ లైట్‌ను ఏఐ ఆల్గరిథమ్ గుర్తిస్తుంది. ఇది మీ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్‌ను లెక్కిస్తుంది. 20 సెకన్లలో ఫలితం తెలిసిపోతుంది. ఆ తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ కనిపిస్తుంది.
ఎంఫైన్ రూపొందించిన బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ టూల్ 80 శాతం మెడికల్ గ్రేడ్ ఆక్యురెసీతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.సాధారణంగా Spo2 లెవెల్ 95 –100 శాతం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి సమస్యలు వస్తాయి. కోవిడ్ తో పాటు ఆస్తమా, సీఓపీడీ, శ్వాసకోశ సంబంధత వ్యాధులు ఉన్నవారుక తరచూ spo2 లెవెల్ చెక్ చేసుకోవాలి.