లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత భూభాగంలో చైనా చొరబడి అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. 20 మంది భారత జవాన్లను బలి తీసుకుంది. ఇక ఇంత తంతు జరిగినా.. చైనా బుద్ధి మాత్రం ఇంకా మారలేదు. గాల్వన్ లోయ తమదేనని చైనా ప్రకటించుకుంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
భారత్, చైనా సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)కి ఆనుకుని తమ దేశం వైపు భూభాగంలో భారత్ స్థావరాలను ఏర్పాటు చేసిందని చైనా ఆరోపించింది. ఆ ప్రాంతంలో భారత్ రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసుకుందని పేర్కొంది. అయితే ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే చైనా ఈ ప్రకటన చేయడం విశేషం.
మరోవైపు ప్రధాని మోదీ సదరు సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన నేతలతో మాట్లాడుతూ.. భారత భూభాగంలో ఒక్క అంగుళం స్థలాన్ని కూడా ఇతర దేశాలు ఆక్రమించుకోలేవని స్పష్టం చేశారు. అమర జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వమని తెలిపారు. అయితే అమెరికా పంపిన శాటిలైట్ చిత్రాలు మాత్రం చైనాయే భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిందని రుజువు చేస్తున్నాయి. అక్కడ చైనా తమ స్థావరాలను నిర్మించుకుందని ఆ చిత్రాల ద్వారా తెలుస్తుంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.