సంక్రాంతి పండుగ వచ్చిందంటే గాలి పటాలను ఎగరేస్తుంటారు. ఇప్పటికే పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా గాలిపటాలను ఎగరేస్తున్నారు. అయితే, గాలి పటాలను ఎగరేసే సమయంలో వినియోగించే చైనా మాంజా మనుషులు, పక్షులకు మరణ శాసనంగా మారింది. చైనా మాంజా చుట్టుకుని చాలా మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు.
గతంలో చైనా మాంజా కారణంగా చాలా మంది గాయపడ్డారు. కొందరు ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ద్విచక్ర వాహనంపై చేపలు పట్టడానికి వెళ్తున్న వ్యక్తికి ‘చైనా మాంజా’ తగిలింది. ఒక్కసారిగా గొంతుకు చుట్టుకోవడంతో మెడ భాగంలో తీవ్ర గాయం అయ్యింది. వెంటనే అతన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. గాలిపటాలు ఎగరేసే సమయంలోనూ చైనా మాంజాతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.