వీ చాట్‌ను బ్యాన్ చేస్తే చైనీయులు ఐఫోన్ల‌ను వాడ‌రు: చైనా విదేశాంగ శాఖ‌ హెచ్చ‌రిక

-

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు చెందిన షార్ట్ మెసేజింగ్ వీడియో యాప్ టిక్‌టాక్ తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీ చాట్‌ను సెప్టెంబ‌ర్ 15 నుంచి త‌మ దేశంలో బ్యాన్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఆ గ‌డువులోగా ఆయా కంపెనీలు త‌మ అమెరికా బిజినెస్‌ను ఇత‌ర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్ర‌యించి ఆ దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇందుకు ట్రంప్ ఇప్ప‌టికే ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే దీనిపై తాజాగా చైనా విదేశాంగ శాఖ స్పందించింది.

అమెరికా త‌మ దేశానికి చెందిన వీ చాట్ యాప్ ను బ్యాన్ చేస్తే.. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ ఉత్ప‌త్తి చేసే ఐఫోన్లు, ఇత‌ర ప్రొడ‌క్ట్స్ ను చైనా వాసులు ఎవ‌రూ వాడ‌రని, వారు వాటిని నిషేధిస్తార‌ని.. చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియ‌న్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు జావో ట్వీట్ చేశారు. చైనాకు చెందిన వీ చాట్ యాప్ ను నిషేధించాక యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను చైనా వాసులు వాడ‌డంలో అర్థం లేద‌ని అన్నారు.

కాగా దీనిపై చైనాకు చెందిన నెటిజ‌న్లు భిన్న ర‌కాలుగా స్పందించారు. త‌మ‌కు యాపిల్ ప్రొడ‌క్ట్స్ అంటే ఇష్ట‌మ‌ని, అందువ‌ల్ల వీ చాట్‌ను బ్యాన్ చేసినా ఆ ఉత్ప‌త్తుల‌ను వాడుతామ‌ని తెలిపారు. మ‌రికొంద‌రు యాపిల్ ప్రొడ‌క్ట్స్ క‌న్నా త‌మ దేశ ప్ర‌యోజ‌నాలే మిన్న అని వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన వీ చాట్ యాప్‌లో ప్ర‌స్తుతం 1.2 బిలియ‌న్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. ఇక చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2020 రెండో త్రైమాసిక గ‌ణాంకాల ప్రకారం యాపిల్ 8 శాతం వాటాను క‌లిగి ఉంది. అక్క‌డి స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో హువావే అగ్ర స్థానంలో కొన‌సాగుతోంది. అయితే చైనా విదేశాంగ ప్ర‌తినిధి చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై అమెరికా కానీ, అటు యాపిల్ కంపెనీ గానీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version