రేపే చిన్నమ్మ ఎంట్రీ..అన్నా డీఎంకేలో ఏం జరుగబోతోంది?

-

తమిళ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే, శశికళ మధ్య రోజుకో ట్విస్ట్‌ తో అత్యంత ఆసక్తికరంగా మారాయి. నిన్నమొన్నటి దాకా శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా చిహ్నం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు శశికళ తమిళనాడు వచ్చే రోజు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనే చర్చ జరుగుతోంది. చిన్నమ్మకు చెక్ పెట్టడానికి తమిళ సర్కారు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. చిన్నమ్మ రాకతో అన్నా డీఎంకేలో ఏం జరుగుతోందన్న ఆసక్తి ఇపుడు అరవ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది.

శశికళ రేపు చెన్నై చేరుకోనున్నారు. చెన్నై రాగానే మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని శశికళ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ శపథం కూడా చేసింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు కూడా జయ సమాధి వద్దకు వెళ్లాలనుకుంటున్నారు శశికళ. అయితే, శశికళ తమిళనాడులో ఎంట్రీ ఇవ్వకముందే పరిస్థితి ఇలా ఉంటే, వచ్చాక ఎలా ఉంటుందో, ఎన్ని మలుపులు, సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.

అదే జరిగితే జయ సమాధి ఉన్న ప్రదేశం..కావటంతో, కార్యకర్తల గుంపు మధ్య భావోద్వేగానికి లోనై, రాజకీయ ప్రణాళికను అక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉందని భావించారు. ఇదే జరిగితే, జయ అభిమానుల్లో శశికళపై కొంత సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీన్నిఊహించిన అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా చిన్నమ్మ ఎత్తుకు పైఎత్తు వేసింది. జయలలిత సమాధికి తుది మెరుగులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నందున 15 రోజుల పాటు ఎవరికీ సందర్శనకు అనుమతి లేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

జయలలిత మరణించాక తమిళనాట అధికార అన్నాడీఎంకేలో విభేదాలు రచ్చకెక్కాయి. పన్నీర్ సెల్వం ఎదురుతిరగడంతో.. పళనిస్వామిని తెరపైకి తెచ్చారు శశికళ. సీఎం అయ్యాక పళనిస్వామి కూడా ఎదురుతిరగడంతో శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. జైలు జీవితం ముగించుకున్న శశికళకు ఈ ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ ఉంటుందో లేదోననే చర్చ..కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో నాలుగురోజుల క్రితం జైలు విడుదలైన శశికళ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనున్నాదనేది ఆసక్తి కలిగిస్తోంది.

అమ్మ మరణం తర్వాత తనదనుకున్న పార్టీనే.. తనను దూరం పెట్టటంతో శశికళకు పెద్ద అవమానమనే చెప్పాలి. దానికిపుడు ప్రతీకారం చూపే అవకాశం వస్తోంది. తన శక్తిని ప్రదర్శించి వచ్చే ఎన్నికలవైపు అడుగులు వేసే అవకాశం ఉందని అన్నాడీఎంకేలో శశికళ అభిమానుల వాదన. అందుకే చిన్నమ్మ తలుచుకోవడమే ఆలస్యం.. అన్నాడీఎంకేకి శశికళ సారధ్యం వహించాలని రాష్ట్రమంతా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఇంతకాలం అటు జయ లేక, ఇటు, శశికళ జైలు పాలవటంతో సైలెంట్ గా ఉన్నవారంతా ఇప్పుడు బయటపడుతున్నారు.

ఇటు పళని స్వామి, పన్నీర్ సెల్వం చిన్నమ్మకు చెక్ పెట్టే ప్రయత్నంలో పోస్టర్ లు వేసిన నేతలను పార్టీనుంచి సాగనంపటం, జయ సమాధిని శశికళ సందర్శించే వీల్లేకుండా మూసేయటం చేస్తున్నప్పటికీ, పార్టీలో ప్రకంపనలు ఆగటం లేదు. చిన్నమ్మ దెబ్బకి అన్నాడీఎంకే నిలువునా చీలినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version