ఎంత పెద్ద స్థాయిలో ఉన్న అతను రైతుకు పుట్టిన బిడ్డే. తాజాగా చిత్తూరు జిల్లాలోని ఉన్నతాధికారులు అలాంటి పనే చేశారు. వాళ్ళు నిత్యం విధుల్లో బిజీగా ఉంటారు. ఏదో పనిమీద వెళ్తుండగా రైతులు పొలంలో నాట్లు వేస్తూ కనిపించారు. ఇంకేముందు అధికార హోదా పక్కనబెట్టి పొలంలో అడుగెట్టారు. రైతులతో కలిసి నాట్లు వేశారు. మేము కూడా రైతు బిడ్డనే అంటూ మరోసారి గుర్తుకు చేసుకున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, తిరుపతి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏఎస్పీ రిషాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరిషా పొలంలో నాట్లు వేశారు. తమ హోదాలు, కార్లు పక్కనబెట్టేసి తలకు పాగా చుట్టు పొలం పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతులతో సరదాగా ముచ్చటించారు. అధికారులు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో పర్యటిస్తున్న అధికారులు తిరుపతి శివారులోని పొలంలో నాట్లు వేయడంతో అక్కడున్నవారంతా ఆసక్తిగా తిలకించారు.
అంతేకాదు నాట్లు వేసిన అనంతరం అధికారులు రైతులతో కాసేపు ముచ్చటించారు. సాగునీరు, ఇటీవల కురిసిన వర్షాలు ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే రకాలు పండిస్తున్నారు..? దిగుబడి, ఎరువులు వాడకంపై ఆరా తీశారు. రైతులు చెప్పిన వివరాలను ఆసక్తిగా విన్నారు. అనంతరం అధికారిక కార్యక్రమాలకు వెళ్లిపోయారు.
ఇక ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాల పొలాలు నీటమునిగాయి. వరితో పాటు ఉద్యానపంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే అంచనాలు రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇక గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 50కి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక అధికారులు దాదాపు రూ.200 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.