ఆ‌ టీడీపీ నేతలు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదా?

-

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచిపోయింది. ఓడిన వారిలో కొందరు ఇంకా తేరుకోకపోతే.. మరికొందరు కండువా మార్చేశారు. ఇంకొందరు జిల్లాకే దూరమయ్యారు. చక్కగా వ్యాపారాలు చూసుకుంటున్నారట. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోందట. మధ్యలో వచ్చిన ఇంఛార్జ్‌ల తీరుతో కార్యకర్తలు విసిగి వేశారిపోతున్నారట.

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఊహించని షాక్‌ ఇచ్చారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే.. 13 చోట్ల వైసీపీని గెలిపించారు. లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీదే విజయం. చివరకు కుప్పంలో సైతం మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ చంద్రబాబు వెనుకబడ్డారు. అయినా జిల్లాలోని టీడీపీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని చర్చ జరుగుతోంది. నాయకులు కార్యకర్తలకు అండగా ఉండాలని స్వయంగా పార్టీ అధినేత చెప్పినా ఎవ్వరూ వినడం లేదట.

మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు కరోనా కంటే ముందే మాయమైపోయారట. నియోజకవర్గంలో వారి జాడ కనిపించడం లేదని అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. చాలా మంది నాయకులు విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో ఉంటూ తమ వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయారని అంటున్నారు. సమయం చిక్కినా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

ఒకవేళ అత్యవసరమై ఫోన్‌ చేసినా స్పందించడం లేదని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నాయకుల తీరు ఇలాగే ఉంటే.. పార్టీ కోసం పనిచేయడం మానేసి.. మేము కూడా మా పనులు మేం చూసుకుంటాం అని వార్నింగ్స్‌ ఇస్తున్నారట. ఈ దిశగానే కొన్ని నియోజకవర్గాల్లో కేడర్‌ సైలెంట్‌ అయ్యిందట.

ఈ సమాచారం అందుకున్న టీడీపీ అధిష్ఠానం ఇటీవల జిల్లాలో కొన్ని కార్యక్రమాలు చేప్టటింది. అయితే పట్టుమని 50మంది కూడా రాలేదట. దీనికంతటికీ ఇంఛార్జ్‌ల వైఖరే కారణమని గ్రహించారట పార్టీ పెద్దలు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, గాలి భాను, కిశోర్‌ కుమార్‌రెడ్డి, అప్పుడప్పుడూ అలా కనిపించి ఇలా మాయమవుతున్నారు తప్ప మిగిలిన వారు పత్తా లేరని అంటున్నారు.

మరోవైపు- కరోనా టైమ్‌లో కొందరు తమ్ముళ్లు కండువాలు మార్చేసుకున్నారు. ఇంకొందరు ఇదే బాటలో ఉన్నారు. వలసలకు రారమ్మని అధికార పార్టీ గేట్లు తెరవడంతో కేడర్‌ ఆగలేకపోయిందనే ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్‌కు ముందు పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పార్టీకి రాజీనామా చేశారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే AS మనోహర్‌ వైసీపీలో చేరారు.

వీరిద్దరే కాదు.. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సైతం గోడ దూకేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అభిమానులు, అనుచరులతో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వీరంతా మంచి ముహూర్తం చూసుకుని ఫ్యాన్‌ గాలి కిందకు చేరతారని టాక్‌ ఉంది.

కొందరు టీడీపీ ఇంఛార్జ్‌లు నియోజకవర్గం గురించి మర్చిపోయారట. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇంకా మూడేళ్లు ఉందిగా.. కంగారెందుకు అని బదులిస్తున్నారట. అధికార పార్టీ నాయకులు కేసులు పెడుతున్నా.. దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. పరిస్థితిలో మార్పు రాకపోతే.. జిల్లాలో టీడీపీకి కేడర్‌తోపాటు నేతలు కూడా దూరం కావడం ఖాయమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version