అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో గతకొంతకాలంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ బుధవారం కూడా కొనసాగింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. మొదట విచారణ ప్రారంభమయిన వెంటనే హిందూ మహాసభ తరుపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్…మాజీ ఐపీఎస్ కిషోర్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకాన్ని కోర్టుకు సమర్పించాలని చూశారు.
ఇక ఆ పుస్తకాన్ని సమర్పించే సమయంలో సున్నీ వక్ఫ్ బోర్డు తరుపు న్యాయవాది రాజీవ్ ధావన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ….ఆ పుస్తకాన్ని చించేస్తానని హెచ్చరించారు. రాజీవ్ వార్నింగ్ ఇచ్చిన వెనక్కితగ్గని వికాస్ తన వాదనని కొనసాగిస్తూ, పుస్తకాన్ని కోర్టుకు సమర్పించే ప్రయత్నం చేయగా, రాజీవ్ జోక్యం చేసుకుని ఆ పుస్తకాన్ని, మ్యాప్ ని చించివేశారు.
అసలు 1986లో ముద్రించిన ఆ పుస్తకాన్ని తీసుకోవద్దంటూ రాజీవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానికి సంబంధించిన కొత్త రికార్డులు కావాలని డిమాండ్ చేశారు. ఇక న్యాయవాదుల వాగ్వాదాలని గమనించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, ఇరువర్గాల న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వాదించుకుంటే విచారణని మధ్యలో నిలిపివేసి, ఇప్పుడే వెళ్లిపోతానని వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.