మొబైల్ ఫోన్లు వాడడం నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను విపరీతంగా వాడడం వల్ల వారి మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వడం వల్ల వారు శారీరకంగా, మానసికంగా పాడవుతున్నారు. ఫోన్లకు అలవాటు పడి కొంతమంది పిల్లలు పిచ్చిగా ప్రవర్తించడం, మరికొంతమంది తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఆత్మహత్యలకు పాల్పడడం చాలానే చూసాం.

తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే…బెంగళూరులో వెబ్ సిరీస్ చూసి ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నమ్మకెరే అచ్చకట్టు పిఎస్ పరిధిలో నివసించే గాంధార్ రీసెంట్ గా జపనీస్ వెబ్ సిరీస్ “డెత్ నోట్” చూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు గదిలోకి వెళ్లి ఓ లేఖ రాసి ఉరేసుకొని చనిపోయాడు. “నేను వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను” అని లేఖలో రాశాడు. సిరీస్ లోని ఓ క్యారెక్టర్ బొమ్మను కూడా తన గదిలో గీసాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాలుడి ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరిని ఎంతగానో కలచివేస్తుంది.