రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లోనే ఉంటారు : భట్టి విక్రమార్క

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన మనస్తాపం చెందితే చర్చించి పార్టీలో ఉండేలా చూస్తామన్నారు.


రాజగోపాల్‌రెడ్డి మీడియాలో చేసిన వ్యాఖ్యల వల్ల భాజపాలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. రాష్ట్ర నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డితో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించామని.. త్వరలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉంటాయని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి.. అమిత్‌ షాను కలవడం యాదృచ్ఛికం కావొచ్చని అభిప్రాయపడ్డారు. బండి సంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని భట్టి విమర్శించారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆగస్టు 10 తర్వాత ఎప్పుడైనా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అంశంపై నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version