టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని, అప్పటి నుంచి తనను ఆ బాధ వెంటాడుతూనే ఉందన్నారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, నిస్వార్థంగా పార్టీకి సేవలందించిన సమర్థవంతుడైన వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. యువగళం సందర్భంగా 100 రోజులు నారా లోకేష్ తో కలిసి తిరిగిన నేత వీరయ్య చౌదరి అని, అమరావతి రైతుల పాదయాత్రలో రైతులకు అండగా నిలిచాడన్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేశాడని, ఇటువంటి నాయకుడిని ఈ విధంగా హత్య చేయడం బాధాకరమైన విషయమని సీఎం అన్నారు.
హత్య జరిగిన నాటి నుంచే ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించిందని సీఎం తెలిపారు. “ఈ కేసు దర్యాప్తుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అన్నింటినీ పరిశీలిస్తున్నాం. 53 కత్తిపోట్లు ఉన్నట్టు నివేదికల్లో ఉంది. ఇది కరుడు కట్టిన నేరగాళ్ల పన్నుగట్టిన కుట్ర,” అని చెప్పారు.
ప్రజల్లో ఎవరికైనా ఈ హత్యకు సంబంధించి సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 9121104784 కు ఫోన్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. నేర రాజకీయాలను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు అని చంద్రబాబు అన్నారు. పోలీస్ వ్యవస్థను కేసు ఛేదించే వరకు నిద్ర పెట్టకుండా పని చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. “వీరయ్య కుటుంబాన్ని మా కుటుంబ సభ్యుల్లాగే భావిస్తాం. వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నా,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
వీరయ్య చౌదరి, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాక, వ్యవసాయ సమస్యలపై స్పందించే, రైతుల పక్షాన నిలిచే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం ఆయన హత్యపై కఠినంగా స్పందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.