ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ని గురువారం ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో మైలవరంలో జరుగుతున్న వ్యవహారాలపై అంశాలవారీగా చర్చ జరిగినట్లు తెలిసింది.
‘నేనుగా ఎప్పుడూ ఎవరినీ ఏమీ అనను. ఇప్పుడు ఈ అనుభవాలతో రాజకీయాలపై ఆసక్తి చచ్చిపోయింది’ అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయగా..సీఎం స్పందిస్తూ..‘అదేం ఉండదు..నియోజకవర్గంపై ఫోకస్ చెయ్, ‘‘గడప గడపకు’’ కార్యక్రమం మొదలుపెట్టు, నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ధనుంజయరెడ్డి (ముఖ్యమంత్రి కార్యదర్శి)కి చెప్పు..అతను సమన్వయం చేస్తాడు..రాజకీయాల్లో నాతో రాబోయే 25, 30 ఏళ్లు ఉంటావు’ అని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ‘ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకుండా సరిచేద్దాం’ అని సీఎం హామీ ఇచ్చారని తెలిసింది. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌లను కలిపి ఒకసారి పిలిచి మాట్లాడి సమన్వయం చేయాలని ధనుంజయరెడ్డికి సీఎం చెప్పినట్లు సమాచారం.