ఏపీ సీఎం జగన్ నేడు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ యూనిట్ ను ఐటీసీ సంస్థ రూ. 200 కోట్లతో నిర్మించింది. 6.2 ఎకరాల స్థలంలో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేసింది. యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ యూనిట్ ద్వారా 14 వేల మంది రైతులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. రెండో దశ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీసీ ప్రణళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు సీఎం జగన్.
ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు సీఎం జగన్. మన రైతులను చేయిపట్టి నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకుందని అన్నారు సీఎం జగన్. ఆర్బీకే విధానం ద్వారా రైతుల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ తొలి స్థానంలో నిలిచిందని వెల్లడించారు సీఎం జగన్.