మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. సీఎం జగన్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇటీవల కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన ఘటనపై స్పందించారు. డ్రోన్ షాట్ల కోసం కందుకూరు సభ ఏర్పాటు చేసి ఎనిమిది మందిని బలిచేశారని విమర్శించారు సీఎం జగన్ . ఫొటో షూట్ కోసం ఘోరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గతంలో గోదావరి పుష్కరాల్లోనూ ఇలాగే 29 మంది చనిపోవడానికి కారకులయ్యారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబుది పబ్లిసిటీ పిచ్చి అని, జనం రాకపోయినా, జనం బాగా వచ్చారని చూపించడం కోసం కందుకూరులో ఇరుకు రోడ్డులో సభ ఏర్పాటు చేశారని సీఎం జగన్ విమర్శించారు.
రాజకీయం అంటే డైలాగులు, షూటింగులు కాదని, రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదని, రాజకీయం అంటే డ్రామాలు అసలే కాదని అన్నారు. పేదల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడమే రాజకీయం అని సీఎం జగన్ తనదైన నిర్వచనం ఇచ్చారు. విపక్ష నేత వైఖరి చూసి ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏ మంచి జరిగినా అన్నీ తన వల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటైందని, ఆఖరికి పీవీ సింధు బ్యాడ్మింటన్ లో విజయం సాధించినా, ఆమెకు ఆట నేర్పింది తానే అని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. 73 ఏళ్ల ముసలాయన అంటూ వ్యంగ్యం ప్రదర్శించిన సీఎం జగన్… ఆయనను చూస్తే వెన్నుపోటు, మోసాలు అనే రెండు అంశాలే గుర్తొస్తాయని విమర్శించారు.