ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ సర్కార్. ఆర్ధిక లోటు ఉన్నా సరే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. వాహన మిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి ఇలా అనేక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. అలాగే కాపు మిత్ర అనే పథకం కూడా సిద్దమైంది. ఒంటరిగా ఉన్న కాపు మహిళలకు జగన్ సర్కార్ ఆర్ధిక సహాయం చేస్తుంది.
ఏటా 15 వేలు ఇవ్వడ౦ ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా మంగళవారం రాత్రి విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విధ్యావసతి దీవెన అనే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించడానికి సిద్దమవుతుంది.
ఈ నెలలో మొదటి విడత, జూలై ఆగస్ట్ లో రెండో విడత నిధులను విడుదల చేస్తారు. దీని ద్వారా రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్ధుల తల్లులకు చేయూత అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చదువుకునే ఆసక్తి ఉండి చదువుకోలేని విద్యార్ధులకు ఈ కార్యక్రమం ఎంతగానో సహకరిస్తుంది. దీనిపై విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.