అధికార వైసీపీలో శాసన మండలి సెగలు రగులుతున్నాయి. అదేంటి.. ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేందు కు తీసుకున్న నిర్ణయం మండలిలో సెగలు ఎలా రేపుతుంది? అనుకుంటున్నారా? అక్కడే ఉంది చిత్రం అంతా! ఎంత లేదన్నా.. వైసీపీలో ఉన్నవారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా వారు రాజకీయంగా దూరంగా ఉన్నారు. అధికారానికి దూరమై ఇబ్బందులు పడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో అధినేత ఆజ్ఞానుసారం తమ టికెట్లను సైతం త్యాగం చేశారు. అలాంటి వారంతా మండలిపై ఆశలు పెట్టు కున్నారు. చాలా మందికి జగన్ స్వయంగా హామీ ఇచ్చారు.
దీంతో మండలి సీటు కోసం ఎదురు చూస్తున్నవారు ఎప్పుడెప్పుడు 2021 వస్తుందా? అని లెక్క పెట్టుకుం టు న్నారు. ఎందుకంటే.. అప్పటికి మండలిలో వైసీపీ కి సీట్లు దక్కుతాయి. అయితే, ఇన్ని ఆశలు పెట్టుకున్న వైసీపీనాయకులపై జగన్ తీసుకున్న మండలి రద్దు నిర్ణయం పిడుగు పాటే అయింది. దీంతో వైసీపీ నాయ కులు తీవ్రస్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంపై పైకి మాట్లాడలేక.. లోలోన బాధపడలేక తమ బాధను ఎవరితోనూ పంచుకోలేక అల్లాడుతున్నారు.
తమ పరిస్థితి ఏంటి? ఏళ్లకు ఏళ్లు.. తాము కష్టపడి పార్టిని నిలబెడితే.. ఇప్పుడు ఏదో చిన్న పదవి అయినా దక్కుతుందని అనుకున్నా.. ఇలా జరిగిందని తలలు పట్టుకుంటున్నారు. ఇదిలావుంటే, చాలా నియోజకవర్గాల్లో నాయకులకు కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అన్నా ఇప్పుడు మన పరిస్తితి ఏంటి? అంటూ దిగువస్థాయి నాయకులు పెద్ద ఎత్తున నాయకులకు ఫోన్లు చేస్తు న్నారు. కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడినట్టుగా ఉందని వారు వాపోతున్నారట.
దీంతో నాయకులు చాలా నియోజకవర్గాల్లో ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు.. కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారని సమాచారం. దీంతో వైసీపీలో మండలి రద్దు.. తదనంతర పరిణామాలు సెగలు పుట్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.