మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపి సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా 6 నెలల తర్వాత ఢిల్లీ వచ్చిన ఏపి ముఖ్యమంత్రి…పోలవరం పై వినతిపత్రం అందించనున్నారు. అలాగే రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల ఆధారంగా పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే అంచనా వ్యయం 55,656 కోట్ల రూపాయలను ఆమోదించాలని కోరనున్నారు సీఎం జగన్. ఈమేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరినున్నారు జగన్. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలని కూడా కోరనున్నారు.
2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందనీ… 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వినతి పత్రం లో ప్రస్తావించనున్నారు సీఎం జగన్. దీనివల్ల ఆర్ అండ్ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగింది. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్ల రూపాయలను రియింబర్స్ చేయాల్సి ఉంది. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని హోంమంత్రికి వివరించనున్నారు సీఎం జగన్.