చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్ లతో సీఎం జగన్ మరోసారి ఫోన్ లో మాట్లాడారు. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీవర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం కూడా అస్తవ్యస్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కలెక్టర్ లకు ఫోన్ చేసి వర్షాపాతం వివరాలను..వరదల ప్రభావాన్ని ఆరాతీశారు. భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్ లలో నీటిమట్టాలను పరిశీలించాలని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
వరదలతో ఇబ్బందులు పడుతున్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సహాయకచర్యల్లో పాలు పంచుకోవాలని సీఎం ఆదేశించారు. ఏం కావాలన్నా తమను సంప్రదించాలని తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని సీఎం కలెక్టర్లకు హామీ ఇచ్చారు.