గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్నారు. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశాం అన్నారు. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదని.. సిబ్బంది హాజరు దగ్గరనుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. రిపోర్టింగ్ స్ట్రక్చర్ పటిష్టంగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలన్నారు. విధులు, బాధ్యతలపై ఎస్‌ఓపీలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనదన్నారు సీఎం జగన్.