ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నామని.. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపండని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్. జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందన్నారు. ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. రేపు ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు.
మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదారినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని.. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని చెప్పారు. కంట్రోలు రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలి.. వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయన్నారు. లైన్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి.. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు తెరవండని పేర్కొన్నారు. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని ఆదేశించారు.