ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలు
కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాల పరిష్కారం కోసం శుక్రవారం సాయంత్రం బేగం పేట నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు పార్లమెంటరీ, శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. తెలంగాణలోని స్థానికులకు ఉద్యోగ నియామకాల కోసం కొత్త జోనల్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు.. దీంతో కొన్ని పోస్టుల నియామకాలను చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటితో పాటు విభజన హామీలు, హైకోర్టు విభజన, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై మూడు రోజుల పాటు అక్కడే ఉండి సంబంధిత కేంద్ర మంత్రులు.. ప్రధానితో చర్చించనున్నారు.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలు
వారంలో రెండు మూడు సార్లు పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడంతో పాటు, ప్రగతి నివేదన సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి 25 లక్షల మంది జనసమీకరణ కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ లోని ఇతర రాజకీయ పక్షలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు సంకేతమా? అయితే తమ తమ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసుకునే యోచనలో పార్టీలు ఉన్నాయి.. ఏది ఏమైన 20 రోజుల వ్యవధిలో కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అటు తెరాసలోనూ ఇటు అన్ని పార్టీల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.